ఏపీలో టికెట్ రేట్ల గొడవ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేట్టు లేదు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై హై కోర్టు సూచనల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.కమిటీ సిఫార్సులు ప్రభుత్వం దగ్గరకు రావడానికీ, ప్రభుత్వం వాటిపై చర్చలు జరిపి, ఓ నిర్ణయానికి రావడానికి చాలా సమయం పడుతుంది. అంటే ఈ సంక్రాంతి సినిమాలకు ఎలాంటి వెసులుబాటూ ఉండదన్నమాట.
మంగళవారం ఏపీ మంత్రి పేర్ని నానితో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్ల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. అందులో టికెట్ రేట్ల గురించిన చర్చ వాడీ వేడీగా సాగిందట. సంక్రాంతి సినిమాలపై కనికరం చూపించాలని, ఈ సారికి... రేట్లు పెంచాలని, పాన్ ఇండియా సినిమాలకు ప్రత్యేక అనుమతులు కావాలని చిత్రసీమ కోరిందని, దానికి పేర్నీ నాని ససేమీరా అన్నారని టాక్. పాన్ ఇండియా సినిమాలైనా సరే, టికెట్ రేట్లలో ఎలాంటి మార్పూ లేదని, ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయో, ఆ రేట్లకే టికెట్లని అమ్మాలని, కమిటీ నివేదిక వచ్చేంత వరకూ ఇప్పటి రేట్లే కొనసాగుతాయని నాని మొహమాటం లేకుండా చెప్పేశార్ట. అంటే... ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ లను సైతం.. తక్కువ రేట్లకే అమ్మాలన్నమాట. కమిటీ నివేదిక రావడానికి, దానిపై చర్చ జరగడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. సంక్రాంతి సినిమాలకు ఇది పెద్ద దెబ్బే.