సాధారణంగా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే... బ్యాంకాక్‌లోనో, గోవాలోనో జరుగుతుంటాయి. దర్శకుడు, సంగీత దర్శకుడు, గీత రచయిత కలసి పాటల్ని రెడీ చేసి తీసుకొస్తుంటారు.
అయితే అరవింద సమేత వీర రాఘవ పాటలన్నీ క్యార్ వాన్‌లోనే పుట్టేశాయి. అరవింద సమేత షూటింగ్ స్పాట్‌లోనే తమన్‌కి ఓ క్యార్ వాన్ ఏర్పాటు చేశారు. అక్కడే ట్యూన్లు సృష్టించాడు తమన్. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలనూ అక్కడికే రప్పించి... పాటల్ని రెడీ చేశారు. రం రుధిరం, రెడ్డి చూడు, పెనిమిటీ..ఈ మూడు పాటలూ కార్ వాన్ లోనే పుట్టాయి. అనగనగనగా మాత్రం ముంబైలో ట్యూన్ చేశాడట తమన్.
''తమన్ చాలా స్పాంటేనియస్‌గా ఉంటాడు. మాతో పాటు ప్రయాణం చేశాడు. కథకు ఏం కావాలో ఆ తరహా పాటలిచ్చాడు. మాతో పాటు తమన్ ఉండడం వల్ల మా పని సులభం అయ్యింది. పాటల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా పోయింది. రం రుధిరం పాట రెండు రోజుల్లో పూర్తి చేశాడ''ని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.
తమన్‌తో కలసి పనిచేయడం త్రివిక్రమ్ కి ఇదే తొలిసారి. కాకపోతే.. వాళ్లిద్దరి మధ్య బాండింగ్ బాగా కుదిరింది. ''తమన్ ఎంత లోతుగా ఆలోచిస్తాడో నాకు ఈ సినిమాతో అర్థమైంది. పైకి కనిపించే తమన్ వేరు, లోపల ఉన్న తమన్ వేరు'' అని కితాబిచ్చాడు త్రివిక్రమ్. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్లు చూస్తుంటే వీరిద్దరూ మళ్లీ కలసి పని చేసే రోజు అతి త్వరలోనే రాబోతోందని అర్థమవుతోంది.