సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు చాలా తక్వువ. టాలీవుడ్‌లో కూడా అంతే. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడిప్పుడే మహిళలు కూడా దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. అయినా సరే ఇంకా దర్శకత్వం వైపు చాలా మంది మహిళలు రావాల్సి ఉందని ప్రముఖ తెలుగు సినీ దర్శకురాలు బి.జయ అన్నారు. 'చంటిగాడు', 'లవ్‌లీ', 'వైశాఖం' తదితర చిత్రాలను జయ తెరకెక్కించారు. చెప్పుకోదగ్గ విజయాల్ని అందుకున్నారు. 'లక్కీఫెలో' టైటిల్‌తో ఆమె తాజాగా ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు.
ప్రస్తుతం కథ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు బి.జయ. జూన్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ యంగ్ హీరో ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఉంది. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్సే. నాగ చైతన్యతో ఓ సినిమా చేయాలని ఆలోచన ఉందంటూ జయ గతంలో చెప్పారు. అయితే నాగచైతన్య డేట్స్ ప్రస్తుతానికి ఖాళీ లేవు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చైతూ ప్రస్తుతం. దాంతో ఇప్పుడిప్పుడే యంగ్ హీరోగా సత్తా చాటుతున్న ఓ యువనటుడు ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఉందని సమాచారమ్. ఎప్పుడూ తన సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకునే జయ సరికొత్త పాయింట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తారట.
మరో పక్క ఇప్పటికే సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల సీనియర్ దర్శకురాలిగా సత్తా చాటారు. ప్రస్తుతం నందినీ రెడ్డి తదితర మహిళా దర్శకులు టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. తాజాగా కృష్ణ కుమారై మంజుల దర్శకురాలిగా మారింది. తాజాగా రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'రంగుల రాట్నం' సినిమాని శ్రీరంజని అనే మహిళా దర్శకురాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం', సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన 'గురు' సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.