అతి పెద్ద క్రెడిట్స్‌ని ప్రామాణికంగా 'బాహుబలి'తో పోల్చి మాట్లాడుతున్నారంటే, 'బాహుబలి'కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది 'బాహుబలి'. సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా రికార్డుల మోత ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ సినిమాని డ్రాగన్ కంట్రీ చైనాలో విడుదల చేశారు. చైనాలో కూడా 'బాహుబలి' రికార్డులు కొల్లగొట్టేస్తోంది. విడుదలైన తొలి రోజే అక్కడ 'బాహుబలి' 2.85 మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించింది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'దంగల్' చిత్రాన్ని 'బాహుబలి' దాటేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. 'దంగల్' అక్కడ 2.49 మిలియన్ డాలర్లు ఓపెనింగ్స్‌ని సాధిస్తే, ఇప్పుడు బాహుబలి ఆ కలెక్షన్స్‌ని బీట్ చేసేసింది. అంతేకాదు, భారీ ఓపెనింగ్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో మూడో స్థానాన్ని 'బాహుబలి' సొంతం చేసుకుంది.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన 'బాహుబలి', ఎన్నో జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులు దక్కించుకుంది.
గతేడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బాహుబలి' చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేయడంతో పాటు, విడుదలయ్యాక ఆ అంచనాలను అందుకోవడంలో కూడా సక్సెస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 1700కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు నమోదు చేసింది.