ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం వివాదస్పమైయింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు.
''మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త...అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు'' అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ.