నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా? అని బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణ ఫలించింది. రేపే.. బాలయ్య సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు. గురువారం ఉదయం 9 గంటల 36 నిమిషాలకు సరిగ్గా ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సాహూ గారపాటి ఈ చిత్రానికి నిర్మాత.
కథానాయిక ఖరారు కావాల్సివుంది. ప్రియాంక జువాల్కర్ పేరు పరిశీలనలో ఉంది. బాలయ్య - ప్రియాంకాలపై ఫొటో షూట్ కూడా నిర్వహించినట్టు టాక్. ఫైనల్ లిస్టులో ప్రియాంక ఉందా? లేదా? అనేది రేపటికి తెలిసిపోతుంది. యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ కూడా ఉండబోతోంది. ఓ భారీ యాక్షన్ సన్నివేశంతో ఈ సినిమా షూటింగ్ మొదలెడతారని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం `వీర సింహారెడ్డి` హడావుడిలో ఉన్నాడు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.