'బిగ్‌బాస్ 2' విజేతగా నిలిచిన కౌషల్‌ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. విశాఖ తీరం నుండి కౌషల్ పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే అసెంబ్లీకా.? లోక్‌సభకా.? అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మంత్రుల స్థాయిలో కౌషల్ గురించి చర్చ జరిగిందట. ఈ విషయమై చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారనీ సమాచారమ్.
ఇటీవల కమెడియన్ అలీని రాజకీయాల్లోకి ఆహ్వానించారు చంద్రబాబు. కానీ అలీ ఏ సమాధానం చెప్పలేదు. కౌషల్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి. బిగ్‌బాస్ టైంలో కౌషల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు, ఒకవేళ కౌషల్ రాజకీయాల్లోకి వస్తే, గెలిపించడానికి కౌషల్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. కౌషల్ అయితే ఇంతవరకూ రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడలేదు.
కౌషల్ విశాఖకు చెందిన వాడే కావడంతో, స్థానికంగా చాలా మంది అభిమానులున్నారు. బిగ్‌బాస్ విజేతగా బిగ్‌హౌస్ నుండి బయటికొచ్చాక కౌషల్ పలు సామాజిక సేవలతోనూ బిజీగా ఉన్నాడు. బిగ్‌బాస్ టైంలో బుల్లితెర వేదికగా రికార్డు సంచలనం సృష్టించిన కౌషల్, రాజకీయాల్లోకి వస్తే, ఎలాంటి సంచలనాలకు కేంద్రబిందువవుతాడో చూడాలి మరి.!