హాస్యం... బ్ర‌హ్మానంద స్వ‌రూపం

By iQlikMovies - February 01, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి 

ఆయ‌న అర‌గుండు..

ఆయ‌నే ఖాన్‌దాదా

ఆయ‌నే మెక్‌డొనాల్డ్ మూర్తి

భ‌ట్టు, ప‌ద్మ‌శ్రీ‌, ప్ర‌ణ‌వ్‌, జ‌య‌సూర్య‌.. అన్నీ ఆయ‌నే.

చిరు న‌వ్వులు, అర‌న‌వ్వులు, ప‌క‌ప‌క‌లు, ద‌ర‌హాసాలు, మంద‌హాసాలు అన్నీ ఆయ‌నే.

ఆనందం అంటే ఆయ‌న‌.. ప‌ర‌మాన‌దం అంటే ఆయ‌న‌.. ఒక్క‌మాట‌లో వెండితెర‌కు బ్ర‌హ్మానందం ఆయ‌న‌.

బ్ర‌హ్మానందం.. ఈ మాట వింటే చాలు.. తెగ న‌వ్వొచ్చేస్తుంది. ఆ రూపం గుర్తొస్తే.. బాధ‌ల‌న్నీ మ‌ర్చిపోయి ఓ ద‌ర‌హాసాల లోకంలో అడుగుపెట్టేస్తాం. 

ఖాన్‌తో గేమ్స్‌ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి!

నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి రావుగారూ!

చేతికి చెప్పులేసుకొని, కాలి వేళ్ల‌కు ఉంగ‌రాలు తొడుక్కొనే  మొహ‌మూ నువ్వూనూ

నా పరఫార్మెన్స్‌ నచ్చితే ఎస్‌ ఎం ఎస్‌ చేయండి...!

- ఇలా ఆయ‌న ఏ డైలాగ్ చెప్పినా.. వెండి తెర న‌వ్వింది. థియేట‌ర్లు గోల పెట్టాయి. ఆ ఎక్స్‌ప్రెష‌న్ కోసం, ఆ డైలాగ్ డెలివ‌రీ కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ సినిమాలు చూసేలా చేశాయి. ఎన్నో సినిమాల్ని త‌న భుజాల‌పై వేసుకుని.. ఒంటి చేత్తో లాగించేశాడు బ్ర‌హ్మీ.

 

అందుకే ద‌ర్శ‌కులు బ్ర‌హ్మానందం కోసం పాత్ర‌లు సృష్టించ‌డానికి పోటీ ప‌డ్డారు. హీరోలు 'మ‌న సినిమాలో బ్ర‌హ్మానందం ఉన్నాడా' అంటూ క‌థ విన‌క‌ముందే ఎంక్వైరీలు చేశారు. ఎంతైనా ఫ‌ర్వాలేదు గాని.. మ‌న సినిమాలో బ్ర‌హ్మానందం ఉండాల్సిందే అని నిర్మాత‌లు ఫిక్స‌యిపోయారు. 

 

అలా.. జంథ్యాల నుంచి ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ వ‌ర‌కూ, విశ్వ‌నాథ్ నుంచి.. రాజ‌మౌళి వ‌ర‌కూ బ్ర‌హ్మానందాన్ని వాడుకోని వాళ్లు లేరు. ఆయ‌న నుంచి హాస్య‌ర‌సం పిండుకోనివాళ్లు లేరు. అందుకే వేయి సినిమాల నుంచీ.. బ్ర‌హ్మానందం కామెడీ బండి.. ఎలాంటి బ్రేకులు లేకుండా న‌డుస్తూనే ఉంది, న‌వ్వులు పంచుతూనే ఉంది.

 

ఈమ‌ధ్య బ్ర‌హ్మానందం కెరీర్ కాస్త మంద‌గించింది. కొత్త‌త‌రం పోటీతో.. బ్ర‌హ్మానందం జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ఆయ‌నా స్వ‌త‌హాగా `విశ్రాంతి` మూడ్లో ఉన్నాడు. అందుకే.. బ్రహ్మీ అంత‌గా క‌నిపించ‌డం లేదు. కానీ మ‌ళ్లీ ఆయ‌న విశ్వరూపం చూడాల‌ని తెలుగు తెర త‌హ‌త‌హ‌లాడుతోంది.

 

ఈమ‌ధ్య బ్ర‌హ్మానందం ఆరోగ్యం కూడా బాలేదు. ఓ కీల‌క ఆప‌రేష‌న్ జ‌రిగింది. అందులోంచి బ్ర‌హ్మానందం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయ‌న సంపూర్ణ ఆరోగ్య‌వంతుడై మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్వించాల‌ని కోరుకుంటోంది  ఐక్లిక్ మూవీస్ టీమ్.

 

హ్యాపీ బ‌ర్త్‌డే బ్ర‌హ్మానందం గారూ..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS