ఈ మధ్య హీరోలు తాము నటించే సినిమాల్లో గట్టిగానే వేలు పెట్టేస్తున్నారు. కొన్నిసార్లు ఆ వేలు పెట్టడం సినిమాలకు కలిసొస్తుంటే, చాలాసార్లు బెడిసికొట్టేస్తోంది. 'డీజె' సినిమా పరాజయానికి అల్లు అర్జున్ అతి కారణమని అప్పట్లో చాలా విమర్శలు వినిపించాయి. అయితే, కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసే విషయంలో నిర్మాత శ్రేయస్సును కోరి ఓ సలహా ఇవ్వడాన్ని, సూచన చేయడాన్ని తప్పు పట్టలేం. విమర్శల దారి విమర్శలదే. ఎవరూ రిస్క్ చేసి, తమ ఇమేజ్‌ని పాడు చేసుకోరు.
బాధ్యత పెరిగింది కనుక ఇంకాస్త అప్రమత్తంగా ఉంటున్నారు నేటి హీరోలు. ఇక అసలు విషయానికి వస్తే, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి అల్లు అర్జున్ కొన్ని సూచనలు చేశాడనీ, వాటికి త్రివిక్రమ్ నుండి కూడా ఆమోదం లభించిందనీ తెలుస్తోంది. మరోపక్క బన్నీ కెలికేస్తున్నాడంటూ అప్పుడే గుసగుసలు గుప్పుమంటున్నాయి. బన్నీకి, త్రివిక్రమ్‌కీ మంచి ర్యాపో ఉంది.
'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి వీరిద్దరి నుండి. సో 'కెలికేయడం' వంటి పెద్ద పదాల్ని బన్నీకి ఆపాదించడం సరికాదంటున్నారు చాలా మంది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఇచ్చిన షాక్‌తో అల్లు అర్జున్ మ్యాగ్జిమమ్ సైలెంట్ అయిపోయాడు. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టి తీరాలని కసితో ఉన్నాడు. అందుకే త్రివిక్రమ్ ఎలా చెబితే బన్నీ అలా చేస్తున్నాడట.