సినిమాలు వేరు - రాజకీయాలు వేరు. విశ్లేషకులు తరచూ చెప్పే మాట ఇది. స్టార్ హీరో సినిమా వస్తోందంటే... ఓపెనింగ్స్ అదిరిపోతాయి. హీరో ప్రచారంలో దిగాడంటే... ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చేస్తారు. కానీ... వాళ్లే పోటీలో నిలబడితే ఓట్లు రాలవు. ఇదే విషయం 2019 ఎన్నికలు నిరూపించాయి. సినిమా స్టార్లు చాలా చోట్ల తేలిపోయారు. వాళ్ల స్సీచులకు జనాలు, అభిమానులు హోరెత్తిపోయాయేమో..? సామాజిక మాధ్యమాలు దద్దరిల్లిపోయాయేమో.
కానీ... జనాలు మాత్రం ఓట్లు వేయలేదు. ఈ ఎన్నికలలో అందరి దృష్టినీ ఆకర్షించిన హీరో.. పవన్ కల్యాణ్. జనసేన పార్టీ స్థాపించి, తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టాడు. గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశాడు. రెండు చోట్లా గెలుస్తాడని కొందరు, రెండు చోట్లా ఓడిపోతాడని ఇంకొందరు పవన్ పై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా కాశారు. ఏదో ఓ దాంట్లో అయినా గెలుస్తాడు కదా అని పవన్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ... ఓటరు తీర్పు వేరేలా ఉంది. రెండు చోట్లా పవన్ ఓడిపోయాడు.
భీమవరంలో చివరి రౌండ్ వరకూ పోటీలో నిలిచాడు గానీ, గాజువాకలో ముందే చేతులు ఎత్తేశాడు. జనసేన తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు కూడా ఓటమి పాలయ్యాడు.బీజేపీపై యుద్ధం ప్రకటించి, కర్నాటకలో ఇండిపెండెంట్‌గా నిలిచిన ప్రకాష్‌రాజ్ ఘోరంగా ఓడిపోయాడు. ఆయనకు కనీసం 30 వేల ఓట్లు కూడా రాలేదు. వైకాపా జోరులో నగరి నుంచి రోజా గెలవడం, ఫ్యాను గాలి ఇంతలా వీస్తున్నా... బాలకృష్ణ (హిందూపురం) స్థానాన్ని కాపాడుకోవడం సినీ తారలకు కాస్త ఓదార్పునిచ్చే విజయాలు.