సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే. 'టైగర్ కేసీఆర్' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బయోపిక్ టైటిల్ లుక్‌ని రామ్‌గోపాల్ వర్మ ప్రకటించడంతోనే సంచలనం మొదలయ్యింది. కొందరు ఆ టైటిల్‌లో 'ఆడు' అనే పదాన్ని పట్టుకుని వర్మని రచ్చకీడ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే 'ఆడు' అనే ప్రస్తావనను కేసీఆర్ అర్థం చేసుకోగలరంటూ వర్మ వివరణ ఇచ్చారు.
ఆ సంగతి పక్కన పెడితే 'టైగర్ కేసీఆర్' సినిమాలో విలన్ ఎవరు? అనేదే ప్రధానమైన చర్చ. ఢిల్లీ స్థాయిలో సోనియాగాంధీపై తెలంగాణ ఉద్యమ సారధిగా కేసీఆర్ పోరాటం చేసినా, రాష్ట్ర స్థాయిలో ఆయనకు రాజకీయ శతృవులు చాలామందే వున్నారు. అందులో చంద్రబాబుని ప్రముఖంగా చెప్పుకోవాల్సి వుంటుంది. కేసీఆర్, ఉద్యమ ప్రస్థానం మొదలైంది టీడీపీలో మంత్రి పదవి దక్కకపోవడంతోనే. కాబట్టి, ఇందులో కూడా చంద్రబాబు పాత్రే విలన్ అని భావించొచ్చు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలోనూ చంద్రబాబు పాత్రని విలన్‌గా చూపించిన రామ్‌గోపాల్ వర్మ, 'టైగర్ కేసీఆర్' సినిమా కోసం కూడా అదే చేయబోతున్నారేమో. చంద్రబాబు పాత్రలో అదరగొట్టేసిన శ్రీతేజ్ ఇంకోసారి 'టైగర్ కేసీఆర్' కోసం చంద్రబాబు పాత్రను పోషిస్తారా? లేదంటే వర్మ ఈసారి కొత్త నటుడి కోసం ప్రయత్నిస్తాడా? నటుడెవరైనా పాత్ర మాత్రం అదే. ఇందులో ఎలాంటి సందేహం అవసరంలేదు.