విలక్షణ నటుడుగా నారా రోహిత్ అందరికీ సుపరిచితుడు. అయితే అంతకన్నా ముందే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తమ్ముడి కొడుకు. ఆ బంధంతోనే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో విసృతంగా పాల్గొన్నాడు. అదే తరుణంలో నారా చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించగా, సున్నితంగా తిరస్కరించాడు.
అయితే ఇప్పుడు నారా రోహిత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట. ఆయన తండ్రి అనారోగ్య రీత్యా నారా రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో తండ్రి వారసత్వం నిలబెట్టాలంటే ఆయన రాజకీయ రంగం ప్రవేశం తప్పేలా కనిపించడం లేదట. త్వరలోనే నారా రోహిత్ రాజకీయ ఎంట్రీ షురూ కానుందని తెలుస్తోంది. చంద్రబాబు, నారా రోహిత్ రాజకీయ తెరంగేట్రానికి తెర వెనక రంగం సిద్ధం చేస్తున్నారట.
ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా, సినిమాలకు దూరం కావాలనే రూలేమీ లేదని చంద్రబాబు నారా రోహిత్‌కి సూచించారట. దాంతో నారా రోహిత్ రాజకీయాల్లోకి రావడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న సినిమాలేమీ లేవని చెప్పలేం. కానీ ఎప్పుడూ సైలెంట్‌గానే ఆయన సినిమాలు చేసేస్తూనే ఉంటారు.