కరోనా పెద్ద దెబ్బే కొట్టింది. ఈ దెబ్బకు పరిశ్రమలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ఈ ప్రభావం చిత్రసీమపై కూడా భారీగానే ఉంది. లాక్ డౌన్ ఎత్తేసినా.. జనాలు థియేటర్లకు వస్తారన్న నమ్మకం లేదు. సినిమా అన్నది మాస్ మీడియా. అందరూ కలిసి చూస్తేనే ఓ థియేటరికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆస్వాదించొచ్చు. కరోనా వల్ల... ఇప్పుడు ఆ అనుభూతి మాయం కానుంది. ప్రభుత్వాలు థియేటర్ల కు అంత త్వరగా అనుమతులు ఇచ్చే ఛాన్స్ లేదు.
ఈ నేపథ్యంలో కరోనా తరవాత చిత్రసీమలో భారీ మార్పులు రాబోతున్నాయేమో అనిపిస్తోంది. సురేష్ బాబు లాంటి నిర్మాతల మాటల్ని చూస్తే.. విప్లవాత్మకమైన మార్పులకు చిత్రసీమ అతి దగ్గరో ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. చిత్రసీమకు ఓటీటీ పెద్ద దిక్కు కాబోతోంది. ఓటీటీని దృష్టిలో ఉంచుకునే సినిమాలు రూపొందబోతున్నాయి. ఇది వరకు శాటిలైట్ మార్కెట్ విజృంభించిన కాలంలో.. కొన్ని సినిమాలు కేవలం శాటిలైట్ కోసమే తీసేవారు.
థియేటర్ నుంచి ఒక్క పైసా రాకపోయినా ఫర్వాలేదు.. శాటిలైట్ అయిపోతే చాలు `అనుకునేవారు. ఆ లెక్కల మధ్య చెత్త సినిమాలు క్యూ కట్టాయి. దాంతో శాటిలైట్ మార్కెట్ మొత్తం డీలా పడిపోయింది. శాటిలైట్ వ్యవస్థ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఓటీటీ వచ్చింది. థియేటర్లో సినిమాని విడుదల చేసుకోలేని సమక్షంలో ఓటీటీ చక్కటి మార్గం. `కనీసం ఓటీటీ వల్ల డబ్బులొస్తే చాలు` అనుకుని సినిమాలు తీసే పరిస్థితి త్వరలో రాబోతోంది. నేరుగా ఇళ్లలోనే సినిమాల్ని విడుదల చేసే సంస్కృతి త్వరలోనే రాబోతోంది.
చిన్న కోడ్ ద్వారా.. సినిమాని డౌన్ లోడ్ చేసుకుని ఇంట్లోనే చూసేయొచ్చన్నమాట. ఓ సినిమా ఒకసారి వీక్షించడానికి ఓ రేటు ఉంటుంది. సెలబ్రెటీలంతా హోమ్ థియేటర్లలోనే సినిమాలు చూసుకుంటున్నారు కదా. ఆ తరహా..ప్రదర్శనలు త్వరలోనే జోరు అందుకునే అవకాశాలున్నాయి. ఇలాంటి సినిమాలు పైరసీ గురి కాకుండా... కొన్ని సాంకేతిక మార్పులు రాబోతున్నాయి. నేరుగా సినిమాని ఇళ్లలోనే చూసుకొనే విధానం ఎప్పటి నుంచో ఉంది. అయితే... చాలామంది నిర్మాతలు ఈ విధానాన్ని అడ్డుకున్నారు. అలా నేరుగా సినిమాల్ని ఇంట్లోనే చూస్తే, థియేటర్లకు రావడం తగ్గిపోతుందని, థియేటర్లపై ఆధారపడే వేలాది కార్మికులకు పని దొరకదని భయపడ్డారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో... ఇంతకు మించిన మార్గం బహుశా నిర్మాతలకు కనిపించకపోవొచ్చు. హీరోలు, దర్శకులు పారితోషికాల్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థియేటరికల్ రెవిన్యూ తగ్గిపోతే ఆ ప్రభావం తప్పకుండా పారితోషికాలపై పడుతుంది. అనవసరమైన ఖర్చుల్నీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు ఒప్పుకున్నవాళ్లే భవిష్యత్తులో మనగలుగుతారు. లేదంటే... పరిస్థితులకు తలొగ్గి.. ఈ ప్రయాణంలో ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోవాల్సివుంటుంది.