సినిమా పరిశ్రమకు ఓటీటీనే ఇప్పుడు పెద్ద దిక్కుగా మారుతోంది.థియేటర్లు మూత బడడంతో - చిన్న నిర్మాతలు తమ సినిమా ప్రదర్శన కోసం ఓటీటీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్ని ఓటీటీ సంస్థలూ క్యాష్ చేసుకుంటున్నాయి. ఇటీవలే అల్లు అరవింద్ నేతృత్వంలో `ఆహా` అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని సూపర్ హిట్ తెలుగు సినిమాలు ఆహాలో ఉన్నాయి. ఇప్పుడు చిన్న సినిమాలకు ఆహా గాలం వేస్తోంది. పూర్తయి, విడుదలకు నోచుకోని కొన్ని చిన్న సినిమాల్ని కొనడానికి `ఆహా` సిద్ధమైంది. అంతేకాదు.. విడుదలై ఒకట్రెండు రోజులు కూడా ఆడని మరి కొన్ని సినిమాల్ని టోకున కొనేస్తోందట.
రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఒక్కో సినిమాకీ ఒక్కో రేటు మిగిల్చి.. ఆయా సినిమాల్ని కొనేస్తోంది `ఆహా`. శాటిలైట్ మార్కెట్ పడిపోవడంతో వందల కొద్దీ సినిమాలు శాటిలైట్ అవ్వకుండానే ఉండిపోయాయి. అలాంటి సినిమాల్ని వెదికి మరీ పట్టుకుంటోంది ఆహా. నేరుగా అల్లుఅరవింద్‌నే ఆయా నిర్మాతలతో మాట్లాడి బేరాలు సెట్ చేస్తున్నార్ట. అలా.. ఆహాకి కొంత కంటెంట్ పొగేసే పనిలో పడ్డారాయన.