మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనమ్మకు పెసర దోశ వేశారు. ‘బి ద ఛాలెంజ్’లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిని నామినేట్ చేసిన విషయం విదితమే. ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, తనదైన స్టయిల్లో ఇంటి పనులు చేశారు. ‘ఇవి నేను రోజూ చేసేవే..’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు మెగాస్టార్. ఈ వీడియోలో చిరంజీవి ఇంట్లోని ఓ గదిలో ఫ్లోర్ ఊడ్చారు. ఆ తర్వాత ఉప్మా పెసరట్టు వేశారు. చిరంజీవి దోశలు వేయడంలో స్పెషలిస్ట్.. అని ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయనతో పనిచేసిన చాలామంది హీరోయిన్లు చెప్పిన విషయం విదితమే. నిజమే, దోశ అంటే చిరంజీవి మాత్రమే వెయ్యాలేమో.! ఎందుకంటే, ఉప్మా పెసరట్టు వేసి, దాన్ని పెనం మీద గాల్లో లేపి, తిరగెయ్యడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఉప్మా పెసరట్టు విషయంలో మెగాస్టార్ చిరంజీవిని ‘మాస్టర్ చెఫ్’ అనొచ్చేమో. వేడి వేడి దోశని పెనం మీద నుంచి తీసి, తన తల్లి అంజనమ్మ ముందుంచారు చిరంజీవి. తనయుడు చేసి తీసుకొచ్చిన ఉప్మా పెసరట్టుని తినే క్రమంలో ముందుగా ఓ ముక్కని తన కుమారుడికి పెట్టింది. కుమారుడు ఎంత ఎదిగినా, తల్లికి ఇంకా చంటిబిడ్డే కదా మరి.! అన్నట్టు, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘మగువా.. మగువా..’ పాట ఈ వీడియోకి ఎక్స్‌ట్రా ‘పవర్’ తీసుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’లోనిది ఈ పాట. ఇక, మెగాస్టార్ చిరంజీవి, బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్‌కి సంబంధించి కేటీఆర్‌నీ, రజనీకాంత్‌నీ నామినేట్ చేయడం గమనార్హం.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020