ఆచార్య అట్టర్ ఫ్లాప్‌తో.. బయ్యర్ల కళ్లు బైర్లు కమ్మాయి. ఈ నష్టాల్లోంచి కోలుకోవడానికి వాళ్లకు చాలా కాలం పట్టొచ్చు. వరుసగా మూడు నాలుగు సూపర్ హిట్లు కొడితే తప్ప లెక్క సరిపోదు. కానీ.. మళ్లీ సినిమా కొనడానికి వాళ్లకు ధైర్యం, పెట్టుబడి ఉండాలి కదా? అందుకే ఆచార్య నష్టాల నుంచి తమని బయటపడేయమని... చిరంజీవిని వేడుకొంటున్నారంతా. చిరు కరుణిస్తాడని, వాళ్ల కష్టాలు గట్టెక్కుతాయని ఆశిస్తున్నారు. అయితే చిరు ఇప్పటి వరకూ తన పారితోషికం నుంచి రూ.10 కోట్లే వెనక్కి ఇచ్చాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ సినిమా కోసం చిరు, చరణ్‌లు సంయుక్తంగా 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. అందులో ఇప్పుడు చిరు తన వాటాగా రూ.10 కోట్లు ఇచ్చాడట. చరణ్ కూడా ఇంకో పది కోట్లు ఇచ్చాడనుకుంటే మొత్తం 20 కోట్లు. అయితే ఇవి బయ్యర్ల నష్టాల భర్తీకి ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే.. నూటికి 70 శాతం పోయింది. నష్టాలు భర్తీ చేయాలంటే కనీసం 50 నుంచి 70 కోట్లు కావాలి. ఈ సినిమా ఆర్థిక లావాదేవీలన్నీ కొరటాల శివనే దగ్గరుండి చూసుకున్నారు. అటు మాట్నీని, ఇటు చరణ్‌నీ పక్కన పెట్టి- బయ్యర్లతో లావాదేవీలు జరిపారు. ఇప్పుడు సర్దుబాటు చేసే టెన్షన్ కూడా కొరటాలకే చుట్టుకున్నట్టు అయ్యింది. మరి చివరికి ఏం చేస్తారో చూడాలి.