ఈసారి మా ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగబోతున్నాయన్న సంగతి అర్థమవుతూనే ఉంది. `మా` అధ్యక్షుడిగా ఈసారి ఏకంగా 5గురు పోటీ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత పోటీ ఎదురు కాలేదు. పోటీలో ఎంతమంది ఉన్నా, గెలుపు ప్రకాష్‌రాజ్‌దే అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఎందుకంటే.. ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంది. చిరంజీవి ఆశీస్సులు ప్రకాష్ రాజ్ కి పుష్కలంగా ఉన్నాయని, చిరు `గో ఎహెడ్` అన్న తరవాతే.. ప్రకాష్ రాజ్ `మా` ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి ప్రకాష్ రాజ్ కి మద్దతు ఉపసంహరించుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ `మా`లో వ్యవహారాలు చాలా క్లిష్టంగా మారుతున్నాయి. పోటీ ఎక్కువయ్యే కొద్దీ... విమర్శలు మొదలవుతున్నాయి. ప్రకాష్ రాజ్‌కి మద్దతు ఇచ్చినా, గెలవకపోతే... చిరు సైతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సివస్తుంది. పైగా మెగా స్టామినా ఇంతేనా? అనే విమర్శలు మొదలవుతాయి. అన్నిటికంటే ఎక్కువగా తనకు సంబంధం లేని వ్యవహారంలో మిగిలినవాళ్లకు యాంటీగా మారే ప్రమాదం ఉంది. అందరివాడుగా తనపై ఉన్న ఇమేజ్‌ని అది భంగం కలిగించకమానదు. పైగా చిత్రసీమకు చిరు ఇప్పుడే పెద్ద దిక్కుగా మారుతున్నాడు. ఇలాంటి వాతావరణంలో... మా ఎన్నికలలో ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే చిరు తటస్థ వైఖరి అవలంభించే అవకాశాలున్నాయని టాక్. అదే చేస్తే... చిరుని నమ్ముకుని బరిలో కి దిగిన ప్రకాష్ రాజ్ గెలవడం దాదాపుగా అసాధ్యమే. చిరు మాట ఇవ్వడంతోనే బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ కి ఇది గట్టి ఎదురు దెబ్బగా మిగిలే అవకాశం ఉంది.