ముంబయ్ నుండి హైద్రాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని ముందుగానే కనిపెట్టిన పైలెట్ వెంటనే అప్రమత్తమై, టేకాప్ అయిన అరగంటకే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి ముంబయ్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలోని 120 మంది ప్రయాణికుల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని విమానంలోని ఓ ప్రయాణికుడు గుర్తించి, ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ విషయం బయటికి వచ్చింది. తృటిలో మెగాస్టార్‌కి ప్రమాదం తప్పినందుకు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల ముంబయ్‌లో 'సైరా' టీజర్‌ని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాని నిర్మించారు. నయన తార, తమన్నా హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. తెలుగు, హిందీతో పాటు, మిగిలిన అన్ని సౌత్ లాంగ్వేజ్‌ల్లో 'సైరా' గ్రాండ్ రిలీజ్ కానుంది.