వినోదం చాలా మారిపోయింది. ఇది వరకు థియేటర్లోనే సినిమా అనుకునే వారు. ఇప్పుడు అర చేతిలోకి వచ్చేసింది. ఓటీటీల పుణ్యమా అని ఇంట్లోనే సినిమా ఎంచక్కా చూసేయొచ్చు. ఓటీటీ అవసరాన్ని హీరోలూ గుర్తించారు. అందుకే స్టార్ హీరోలు సైతం ఓటీటీలకు సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నారు. వెబ్ సిరీస్ లంటారా...? అవి సరే సరి. వెంకటేష్ లాంటి అగ్ర హీరో కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. చిరంజీవి కూడా అప్పట్లో `మంచి కథలొస్తే వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమే` అన్నారు. అయితే.. ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ఓ బడా ఓటీటీ సంస్థ చిరునిసంప్రదించింది. ఆయనతో ఓ గంట నిడివి గల వెబ్ మూవీ చేయాలని ప్లాన్ చేసింది. కథ కూడా రెడీ. చిరు ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ చిరు మాత్రం `నో` అన్నారు. నిజానికి ఇప్పుడు చిరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నారు. ఈ దశలో ఓ నెల రోజులు వెబ్ మూవీకి కాల్షీట్లు కేటాయించడం చాలా కష్టం. అందుకే ఈ ఆఫర్ ని తిరస్కరించారేమో..? అయితే ఈ కథని పట్టుకుని, మరో అగ్ర హీరో దగ్గరకు వెళ్లాలని ఆ ఓటీటీ సంస్థ భావిస్తోంది. మరి ఈసారి ఆ హీరో ఎవరో??