చిరంజీవి, శ్రీదేవి జంటగా వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. చిరంజీవి కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
అయితే ఆ టైంలోనే ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలని అశ్వనీదత్ భావించారు. కానీ కుదరలేదు. తర్వాత చిరంజీవి సినిమాలకు దూరం కావడం, చిరు తనయుడు చరణ్ ఎంట్రీ షురూ కావడంతో, చరణ్ తొలి సినిమాగా ఈ సీక్వెల్‌నే తెరకెక్కించాలని అనుకున్నారు. అంతేకాదు, శ్రీదేవి కుమార్తై జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, తొలి సినిమాకే చరణ్‌కి అంత బరువైన పాత్ర వద్దనీ, ఓ మాస్ చిత్రంతో ఎంట్రీ ఇస్తే బావుంటుందనీ పూరీతో 'చిరుత' సినిమా చేయించాడు.
ఆ తర్వాత చాలాసార్లు ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేశారు. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఎలాగైనా చిరంజీవితోనే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్నది అశ్వనీదత్ కోరిక. కాగా ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో, అశ్వనీదత్ కోరిక నెరవేరనుందనీ, త్వరలోనే ఈ సీక్వెల్ తెరకెక్కబోతోందని తాజాగా ప్రచారం జరుగుతోంది.
లేటెస్టుగా వైజయంతీ బ్యానర్‌లో వచ్చిన 'మహానటి' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర యూనిట్‌ని స్వయంగా ఇంటికి ఆహ్వానించి వారికి అభినందనలు తెలిపారు. ఖచ్చితంగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో సినిమా చేద్దాం అని మరోసారి హామీ ఇచ్చారు. అదీ సంగతి.