చిరంజీవి - శ్రీదేవిల కలయిక ఎంత సూపర్ హిట్టో.. `జగదేక వీరుడు - అతిలోక సుందరి` ని చూస్తే తెలుస్తుంది. ఈ జంటని చూడ్డానికి రెండు కళ్లూ సరిపోలేదు. అంతగా మ్యాజిక్ చేశారు. అయితే ఆ తరవాత వచ్చిన `ఎస్.పి.పరశురామ్` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాని చిరు- శ్రీదేవిల జోడీ కూడా కాపాడలేకపోయింది. నిజానికి ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రావాల్సింది. కానీ.. ఆగిపోయింది.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన `మిస్టర్ ఇండియా`ని తెలుగులో శ్రీదేవి, చిరంజీవిలతో రీమేక్ చేద్దామనుకున్నార్ట. దానికి శ్రీదేవినే నిర్మాత. కోదండ రామిరెడ్డి దర్శకుడు. ఓ పాట కూడా రికార్డ్ చేసి, షూటింగ్ మొదలు అనగా... ఆపేశార్ట. దానికి కారణం కోదండరామిరెడ్డినే. ఎందుకో ఆయనకు `మిస్టర్ ఇండియా` నచ్చలేదు. తెలుగులో తీస్తే... ఫ్లాప్ అవుతుందని భయపడ్డార్ట.
కోదండరామిరెడ్డి జడ్జిమెంట్ అంటే చిరంజీవికి గురి ఎక్కువ. ఆయన `నో` అనేసరికి ఆ రీమేక్ ఆపేశారు. కానీ.. నిజంగా ఆ సినిమాని రీమేక్ చేస్తే.. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యేదని, ఓ మంచి అవకాశాన్ని చేతులారా వదులుకున్నానని... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాధపడ్డారు కోదండరామిరెడ్డి.