గబ్బర్ సింగ్... ఈ సినిమాని పవన్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. పవన్ చేసిన పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇది. పవన్ పాత్ర చిత్రీకరణ, డైలాగులూ, పవన్ మేనరిజం అన్నీ సూపరే. పవన్‌కి ఫ్యాన్స్‌కి నచ్చేలా చూపించగలిగాడు హరీష్ శంకర్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం ఉన్నా - ఈలోపే ఈ సినిమా గురించిన ఆసక్తి కరమైన అంశాలు బయటకు లీకైపోతున్నాయి.
అప్పుడెప్పుడో పవన్‌కి ఓ లైన్ చెప్పి ఒప్పించిన హరీష్... ఆ తరవాతి నుంచి స్క్రిప్టు పనుల్లో పడిపోయాడు. ఇప్పుడు పూర్తి స్థాయి కథని సిద్ధం చేశాడని, ఇటీవల పవన్ ని కలిసి కథ మొత్తం వివరించాడని, పవన్ సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథని ఓకే చేశాడని టాక్. అంతే కాదు, ఈ సినిమాలో పవన్ పాత్రేమిటన్నదీ బయటకు వచ్చింది. ఇందులో పవన్ డాన్ గా కనిపించనున్నాడట. అదీ కొద్ది సన్నివేశాల్లో మాత్రమే. డాన్ గా కనిపించిన ఆ కాసేపు థియేటర్లు దద్దరిల్లిపోయేలా సన్నివేశాల్ని రాసుకున్నాడట హరీష్. ఈ వార్త కచ్చితంగా పవన్ అభిమానుల్లో సంతోషం నింపేదే. ఎందుకంటే పవన్ పూర్తి స్థాయి మాస్ మసాలా సినిమా చేసి చాలా కాలం అయ్యింది. అందుకే ఆలోటు భర్తీ చేసే విధంగా ఈ కథని రాసుకున్నాడట హరీష్.