పవన్ కల్యాణ్ చివరి చిత్రం `అజ్ఞాతవాసి` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రాజకీయాల పరంగానూ.. పవన్‌కి పరాజయమే ఎదురైంది. పవన్ గ్లామర్ బాగా తగ్గింది. గెడ్డం, ఒత్తైన జుట్టు - సినిమా రంగానికి చాలా దూరంగా ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడూ పవన్ ని చూస్తుంటే.. అసలు సినిమా హీరోనేనా? అన్న డౌటు కూడా వస్తుంటుంది. కానీ.. ఇప్పుడు పవన్ చేతిలో ఆరు సినిమాలున్నాయి. ఎప్పుడూ లేనంత బిజీ అయిపోయాడు. పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే చాలు. షూటింగులు టక టక మొదలైపోతాయి. పవన్ ఓకే అంటే చాలు... అడ్వాన్సులు వచ్చి పడిపోతున్నాయి.
ఓ వైపు పవన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. మరోవైపు చిత్రసీమ స్లంప్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితులోనూ పవన్ తన రేంజ్ చూపిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. వకీల్ సాబ్ కోసం పవన్ దాదాపు 50 కోట్ల పారితోషికం తీసుకున్నడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్‌కీ దాదాపు అంతే తీసుకుంటున్నాడని టాక్. ఈ సినిమా కోసం పవన్ 30 రోజుల కాల్షీట్లు ఇస్తున్నాడట. రోజుకి 1.5 కోట్లు వసూలు చేస్తున్నాడట. అంటే...45 కోట్లన్నమాట. ఈ రేంజు పారితోషికం మరో నటుడికి లేదన్నది వాస్తవం రోజుకి కోటిన్నర అంటే.. సంవత్సరానికి కనీసం 200 రోజులు షూటింగ్ చేసినా, పవన్ చేతిలో 300 కోట్లుంటాయి.
''నేను హిట్ సినిమాలు చేసినప్పుడు డబ్బులు రాలేదు. ఫ్లాపులు తీసినప్పుడే ఎక్కువ డబ్బులిస్తామని నిర్మాతలు నా దగ్గరకు వచ్చేవారు'' అని పవన్ ఓ సందర్భంలో అన్నాడు. ఆ మాట అక్షర సత్యం. బహుశా ఇలాంటి క్రేజ్ మరే ఇతర హీరోకీ లేదేమో. దటీజ్... పవర్ స్టార్.