చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మధ్య దాదాపుగా ప్రతి సినిమాకీ ఈ సమస్య ఎదురవుతోంది. మొదట్లో ‘ఇదొక టైపు పబ్లిసిటీ స్టంట్’ అనే చర్చ జరిగినా, తర్వాత్తర్వాత.. ఆయా సినిమాలకు ఈ లీకులు తలనొప్పిగా మారుతున్నాయి. ‘చిరంజీవి 152’ సినిమాకి బజ్ తీసుకురావడం కోసమే స్టిల్‌ని లీక్ చేశారంటూ ఓ పక్క హేటర్స్ ప్రచారం చేస్తోంటే, చిరంజీవి సహా దర్శకుడు కొరటాల శివ, నిర్మాతల్లో ఒకరైన రావ్‌ుచరణ్.. ఈ లీక్ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
షూటింగ్ స్పాట్‌లో ఈ వెకిలి పని ఎవరు చేశారు.? అన్న విషయమై ఆరా తీస్తున్నారట. మొబైల్ ఫోన్లలో హై క్వాలిటీ ఇమేజింగ్ ఫీచర్స్ వచ్చేసిన తర్వాత.. ఇలాంటివాటిని కట్టడి చేయడం దాదాపు అసాధ్యం. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి సంబంధించి ఆన్ లొకేషన్ వీడియోను దూరం నుంచి చిత్రీకరించి, ఇంటర్నెట్‌లో వదిలేశారు. దూరంగా వున్న ఓ బిల్డింగ్ లోంచి తీసిన వీడియో అది. చిరంజీవి విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. చాలా దగ్గర్నుంచి ఫొటో తీశారు. సో, ఎవరు ఆ ఫొటో తీశారో కనుగొనడం చిత్ర దర్శక నిర్మాతలకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఇలాంటి చర్యల్ని ఎప్పటికప్పుడు అడ్డుకోవడమంటే కాస్త కష్టమైన వ్యవహారమే. అన్నట్టు, ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే పేరుని పరిశీలిస్తోన్న విషయం విదితమే. నక్సలైట్ పాత్రలో చిరంజీవి కన్పించబోతున్నారన్న ప్రచారానికి తాజాగా లీక్ అయిన ఫొటో మరింత ఊతమిస్తోంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. చిరంజీవి ఈ గెటప్‌లో అదరగొట్టేశారంతే.