వసూళ్ల హీరో ఆఫ్ ది ఇయర్ గా విజయ్ దేవరకొండ పేరు కూడా టాప్ ప్లేస్‌లోనే ఉంటుంది. 'గీత గోవిందం' సినిమాతో బీభత్సమైన క్రేజ్‌తో పాటు, అత్యధిక స్థాయి వసూళ్లు కొల్లగొట్టాడీ యంగ్ హీరో. 'నోటా' నిరాశపరిచినా, 'టాక్సీవాలా' సినిమాతో పుంజుకున్నాడు. పుంజుకోవడమంటే అలా ఇలా కాదు.
మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లో సినిమా పూర్తి డిజిటల్ ప్రింట్ లీకైపోయింది. దాంతో 'ట్యాక్సీవాలా' విడుదలయ్యే సినిమా కాదని అందరూ పెదవి విరిచేశారు. కానీ ధైర్యంగా సినిమాని విడుదల చేసి, ఆల్రెడీ లీకైపోయిన ఈ సినిమాతో రికార్డు స్థాయి వసూళ్లు కొల్లగొట్టాడంటే మనోడి స్టామినా అప్పుడు అర్ధమైంది అందరికీ, ఎవ్వరూ ఊహించని స్థాయిలో విజయ్ దేవరకొండ ఈ ఏడాది బాక్సాఫీస్ వసూళ్ల రారాజుగా దూసుకెళ్లాడు.
ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన స్టార్ హీరోల సినిమాలు 'రంగస్థలం', 'భరత్ అనే నేను' 100 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, లాభాల పరంగా నిర్మాతలకు కాసుల పంట పండించిన హీరో మాత్రం వన్ అండ్ ఓన్లీ విజయ్ దేవరకొండ మాత్రమే. పెట్టిన పెట్టుబడితో సంబంధం లేకుండా అనూహ్యమైన లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం', 'ట్యాక్సీవాలా' సినిమాలు.
అలాగే ప్రతిష్ఠాత్మక చిత్రం 'మహానటి' విజయం కూడా విజయ్‌దేవరకొండ క్రెడిట్ ఖాతాలోనే పడుతుంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌లోనూ విజయ్‌దేవరకొండకు ఎంతో కొంత భాగం లేకపోలేదు. అలా ఈ ఏడాది వసూళ్ల గోవిందుడుగా విజయ్ దేవరకొండ క్రెడిట్ కొట్టేశాడు.