పైకి ఎంత ఆనందంగా కన్పించినా, శరీరంలో అనేకానేక మార్పులు జరుగుతుంటాయి. అనారోగ్య సమస్యల్ని గుర్తించడం ఎవరికైనా అంత తేలిక కాదు. హాస్య బ్రహ్మగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో బ్రహ్మానందంకి సర్జరీ జరిగిందన్న వార్త ఒక్కసారిగా సినీ పరిశ్రమలో అందరికీ షాక్‌కి గురిచేసింది.
తెలుగు సినీ ప్రేక్షక లోకం సైతం బ్రహ్మానందంకి ఏమయ్యిందోనన్న ఆందోళనతో ఉలిక్కిపడింది. బ్రహ్మానందంకి శస్త్ర చికిత్స జరిగిన మాట వాస్తవమేననీ, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని బ్రహ్మానందం సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. వయసు మీద పడ్తున్నా, బ్రహ్మానందం ఎప్పుడూ యాక్టివ్‌గానే కన్పిస్తుంటారు. ఇటీవల బుల్లితెరపైనా బ్రహ్మానందం హాస్యపు జల్లు కురుస్తోంది ఓ కామెడీ షో ద్వారా. సినిమాల్లో స్టార్ కమెడియన్‌గా ఇంకెవరికీ దక్కని స్టార్‌డమ్ బ్రహ్మానందంకి దక్కింది.
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మానందం పాత్ర లేకపోవడమా? అన్నట్లుండేది. ఒక్కోసారి స్టార్ హీరోలనీ బ్రహ్మానందం పాత్ర డామినేట్ చేసేలా వుండేది. దర్శకులు ఆ స్థాయిలో బ్రహ్మానందం కోసమే ప్రత్యేకంగా ట్రాక్‌లు రాసేవారు. అయితే గత కొంతకాలంగా వెండితెరపై బ్రహ్మానందం హవా కాస్త తగ్గిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆయన బుల్లితెరపైకొచ్చారన్న వాదనలూ లేకపోలేదు. ఏదిఏమైనా, బ్రహ్మానందం పూర్తిగా కోలుకుని తిరిగి హాస్యపు జల్లు కురిపించాలని ఆశిద్దాం.