బాలయ్య స్వీయ నిర్మాణంలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బయోపిక్ మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మాత్రమే చూపించారు. ఇక రెండో పార్ట్‌లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కొచ్చిపడింది. సినీ చరిత్ర అంటే తెరపై ఆ స్థాయిలో పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ తెర వెనుక ఏంటీ.? అనే కోణంలో కొన్ని తెలియని అంశాలు ఆడియన్స్‌లో ఆశక్తిని పెంచాయి. సో ఆ రకంగా ఈ సినిమా ఓ మోస్తరు విజయం అందుకుందంతే.
అయితే రెండో పార్ట్‌గా రాబోతున్న 'ఎన్టీఆర్ మహానాయకుడు' పరిస్థితి అలా కాదు. రాజకీయ జీవితం అంటే అంతా పబ్లిక్కే. ప్రజలకు దాదాపు తెలియని అంశాలేమీ ఉండవు. ముఖ్యంగా రాజకీయం అంటే పోరాటం. పోరాటంలో ప్రత్యర్ధి పాత్ర కీలకం. ప్రత్యర్థి లేని పోరాటంలో ఏం పస ఉంటుంది. ఆ పాయింటే 'ఎన్టీఆర్ మహానాయకుడు'పై అంచనాలు తగ్గించేస్తోంది. ఈ సినిమాలో విలన్ అంటే ఎవరూ లేరట. అయితే గియితే చంద్రబాబును విలన్‌గా చూపించాలి. కానీ అది అసాధ్యం.
ఇక రాజకీయాల పరంగా ఎన్టీఆర్‌కి ప్రత్యర్థి అంటే నాదెండ్ల భాస్కర్‌రావు. ఆయన పాత్రను కూడా విలన్‌గా చూపించడం లేదనీ సమాచారమ్ వచ్చేసింది. నాదెండ్ల భాస్కర్ నుండి ముందుగానే ఈ బయోపిక్‌కి హెచ్చరికలు జారీ చేయడంతో నాదెండ్ల క్యారెక్టర్‌ని కూడా సాఫ్ట్ చేసేశారట. అసలు నాదెండ్ల క్యారెక్టరే లేదంటూ మరో వాదన కూడా ఉంది. ఇవన్నీ బేరీజు వేసుకుంటే, ఎన్టీఆర్ మహానాయకుడిపై అభిమానులు అంచనాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాలి మరి.