'పద్మావత్‌' ఔట్‌ - 'మణికర్ణిక' ఇన్‌

మరిన్ని వార్తలు

దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పద్మావత్‌' చిత్రం ఇటీవల దేశ వ్యాప్తంగా వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా విడుదలై, వివాదాల్లో విషయం లేదనీ, సినిమా సూపర్‌ హిట్‌ అనీ తేలిపోయింది. అయితే ఇప్పుడు వివాదాల గాలి మరో సినిమాకి తగిలింది. అదే బాలీవుడ్‌లో క్రిష్‌ తెరకెక్కిస్తున్న 'మణికర్ణిక'. 

ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. కాగా చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కూడా చరిత్రని వక్రీకరిస్తున్నారంటూ వివాదాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్‌లోని సర్వ బ్రాహ్మణ మహాసభ వ్యతిరేకిస్తోంది. ఇంతకీ వివాదం ఏంటంటారా? ఈ సినిమాలో బ్రిటీష్‌ వ్యక్తితో ఝాన్సీ లక్ష్మీభాయ్‌కి ప్రేమ బంధాన్ని అభ్యతరకరంగా చూపించారంటూ తద్వారా చరిత్రని వక్రీకరిస్తున్నారంటూ వీరు ఆరోపిస్తున్నారు.

ఝాన్సీ లక్ష్మీభాయ్‌ యుక్త వయసు నుంచే దేశం కోసం బ్రిటీష్‌ వారితో వీరోచితంగా పోరాడిందనీ, అలాంటి ఆమె ప్రతిష్టను తప్పుగా ఎలా చూపిస్తారంటూ ఆందోళనలు రేపుతున్నారు. అయితే సినిమా చూస్తే కానీ, సినిమాలో ఏముందో తెలీదు. 'పద్మావత్‌' విషయంలోనూ అలాగే జరిగింది. తీరా సినిమా విడుదలయ్యాక చరిత్రని వక్రీకరించిన సన్నివేశాలెక్కడా లేవనీ, చరిత్ర పేరు ప్రతిష్ఠలు మరింత పెంచేలానే సినిమా ఉందనీ, విడుదలయ్యాక ఆందోళనకారులే చెప్పడం జరిగింది. 

అలాగే 'మణికర్ణిక' కూడా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉండగానే వివాదాలు చుట్టముట్టాయి. సినిమా నిర్మాణం పూర్తవ్వాలి. అది సెన్సార్‌కి వెళ్లాలి. ఆ తర్వాత కదా అందులో ఏ అభ్యంతర సన్నివేశాలున్నాయనేది తెలిసేది. ఇలా నిర్మాణ దశలో ఉన్నప్పుడే భారీ బడ్జెట్‌ చిత్రాల విషయంలో వివాదాలు తలెత్తడం నిజంగా దురదృష్టకరం. 'పద్మావత్‌' విషయంలో ఈ వివాదాలతో చిత్ర యూనిట్‌ చాలా నష్టపోయింది. ఇప్పుడు క్రిష్‌ - 'మణికర్ణిక' పరిస్థితి ఏం జరగనుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS