సోషల్ మీడియాలో 'ప్యాడ్‌మాన్ ఛాలెంజ్' హ్యాష్ టాగ్‌తో ఓ యుధ్దమే జరుగుతోంది. నిశ్శబ్ధాన్ని చేధించండి శానిటరీ ప్యాడ్స్ ఆవశ్యకతను తెలియజేయండి. అవగాహనను పెంచండి అంటూ ఈ ఛాలెంజ్‌ని మొదలు పెట్టారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'ప్యాడ్‌మాన్' సినిమా ఈ శానిటరీ ప్యాడ్స్ మీద తీసిన సినిమానే. అరుణాచలం మురుగనాదమ్ అనే సామాజిక వేత్త ఈ శానిటరీ ప్యాడ్స్ కోసం ఉద్యమించాడు. ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో సత్కరించింది. ఆయన జీవిత చరిత్ర ని బేస్ చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. సినిమా ప్రచారం కోసం పనిలో పనిగా శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన కోసం ఈ ప్యాడ్‌మాన్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో మొదలైంది. అక్షయ్ కుమార్‌లాంటి పెద్ద హీరో ఈ సినిమాలో నటించడంతో 'ప్యాడ్‌మాన్ ఛాలెంజ్'కి సినీ ప్రముఖులు మద్దతు పలికారు.
హీరోలు, హీరోయిన్లు శానిటరీ ప్యాడ్స్ చేత పట్టుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్ కుమార్ 'ప్యాడ్‌మాన్ ఛాలెంజ్'ని స్వీకరించి, శానిటరీ ప్యాడ్‌తో ఫోటో దిగి, మరికొందరు సినీ ప్రముఖులకు సవాల్ విసిరాడు. ఆ లిస్టులో రాజమౌళి పేరు పెట్టాడు. ఇప్పుడు రాజమౌళి ఈ సవాల్‌ని స్వీకరించాల్సిందే. టాలీవుడ్ నుండి ఇంతవరకూ ఈ శానిటరీ ప్యాడ్స్ ఛాలెంజ్‌పై స్పందించలేదు.
ఒకవేళ రాజమౌళి స్పందిస్తే, టాలీవుడ్ నుండి ఆయనే తొలి వ్యక్తి అవుతాడు. సామాజిక బాధ్యత విషయంలో మన టాలీవుడ్ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు. ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కోసం రాజమౌళి, అల్లు అర్జున్ లాంటి వాళ్లు తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. కాబట్టి ఈ ప్యాడ్‌మాన్ ఛాలెంజ్ టాలీవుడ్‌లో కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంది.