‘కరోనా వైరస్’ని మనం ముందుగా ఊహించలేదు.. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఎవరూ అనుకుని వుండరు. సో, మేం కూడా అంతే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్‌కి కరోనా కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డ మాట వాస్తవమేననీ, ఆ ఇబ్బంది అన్ని సినిమాలకీ కలిగిందనీ, ఇకపై సినిమాలు తీసే విధానంలో కొంత మార్పు రావడం ఖాయమని దర్శకుడు రాజమౌళి అభిప్రాయపడ్డాడు. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి సంబంధించి ఎలాంటి మార్పులూ వుండబోవనీ, ముందుగా ఈ సినిమా గురించి ఏం అనుకున్నామో అదే చేస్తామని రాజమౌళి స్పష్టం చేశాడు.
‘షెడ్యూల్స్‌లో మార్పులుండొచ్చు.. ఫైనల ప్రాజెక్టులో ఎలాంటి మార్పూ వుండదు..’ అని తేల్చి చెప్పిన రాజమౌళి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణ పూర్తి, సినిమా రిలీజ్ వంటి విషయాలపై ‘లాక్‌డౌన్’ ఎత్తివేశాకే పూర్తి స్పష్టత వస్తుందని అంటున్నాడు. అనుమతులు ఎప్పుడు వస్తాయో తెలియదనీ, కరోనా నేపథ్యంలో చాలా మారిపోయాయనీ, ఆ మార్పుకు తగ్గట్లుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందని రాజమౌళి అన్నాడు. జనవరి 8న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించామనీ, అదే తేదీన సినిమా విడుదల చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని రాజమౌళి వ్యాఖ్యానించడం గమనార్హం. ‘మా టీమ్ లో ప్రతి ఒక్కరూ ఛాలెంజెస్‌ని ఇష్టపడ్తారు. చరణ్, ఎన్టీఆర్ సహా అందరిదీ అదే తీరు. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్..’ అని రాజమౌళి పేర్కొన్నారు.