రజనీకాంత్ సినిమా అంటే కొత్త రికార్డుల మోత మోగిపోవాల్సిందే. ఎన్ని ఫ్లాపుల తరవాత వచ్చినా - వందల కోట్ల బిజినెస్ చేయగల సత్తా రజనీకి మాత్రమే సొంతం. ఈ విషయం మరోసారి రుజువైంది. వరుసగా మూడు ఫ్లాపుల తరవాత రజనీ సినిమా `దర్బార్` ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు ముందే బిజినెస్ పరంగా కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం దాదాపు 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
హిందీలో ఈ సినిమాని 17 కోట్లకు కొన్నారు. తమిళనాడు థియేటరికల్ రైట్స్ రూపంలో 63 కోట్లు వచ్చాయి. శాటిలైట్ రూపంలో మరో 33 కోట్లు దక్కాయి. అమేజాన్ నుంచి 25 కోట్లు వచ్చాయి. తెలుగు హక్కుల్ని 7.5 కోట్లకు కొన్నారు. కర్నాటక రైట్స్ రూపంలో 7 కోట్లు వచ్చాయి. కేరళ నుంచి మరో 5.5. కోట్లు దక్కాయి. ఓవర్సీస్ హక్కుల్ని 33 కోట్లకు కొన్నారు. ఆడియో రైట్స్ రూపంలో 5 కోట్లు వచ్చాయి. ఇలా.. ఎటు చూసినా కోట్లకు కోట్లు వచ్చి పడిపోయాయి. రజనీ పారితోషికం మినహాయిస్తే ఈ సినిమాకి 70 కోట్లు కూడా ఖర్చు కాలేదని తెలిసింది. అంటే.. దాదాపుగా 80 నుంచి 90 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా నిర్మాతలు వెనకేసుకున్నారన్నమాట. రజనీ స్టామినా అలాంటిది.