టాలీవుడ్ ఆలోచనల్ని సమూలంగా మార్చేసిన సినిమా 'శివ'. అదో ట్రెండ్ సెట్టర్. కథలు ఎలా ఆలోచించాలో, రాసిన కథల్ని ఎలా తీయాలో చూపించిన సినిమా అది. ఆ తరవాత.. ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న చిత్రాలు చాలా వచ్చాయి. వాటిలో 'అర్జున్ రెడ్డి' కూడా ఒకటి. ఇప్పుడు ఈ రెండు సినిమాల్నీ కలిపేస్తే ఎలా ఉంటుంది?? ప్రస్తుతానికి `డియర్ కామ్రేడ్`లా ఉంఉందని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది.
ఈ నెలలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అటు శివ, ఇటు అర్జున్ రెడ్డి రెండు సినిమాల ప్రభావం ఉన్నట్టు కనిపిస్తోంది. కాలేజీ రాజకీయాలకు దర్పణం పట్టిన సినిమా శివ. విద్యార్థుల మధ్య గ్రూపులు, గొడవలతో ఆ సినిమా అట్టుడికిపోయింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఓ కుర్రాడి జీవితం ఏమవుతుందో, ఏం కోల్పోవాల్సివస్తుందో - అర్జున్ రెడ్డిలో చూపించారు. డియర్ కామ్రేడ్ లో ఈ రెండు సినిమాల లక్షణాలూ పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కాలేజీ నేపథ్యంలో సాగే కథ డియర్ కామ్రేడ్. విద్యార్థి రాజకీయాల్ని ఇందులో చూపించబోతున్నారు. కథానాయకుడికి కోపం ఎక్కువ. ఆ కోపం వల్ల తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరం కావల్సివస్తుంది. మరి తన ప్రేమని చివరికి ఎలా కాపాడుకున్నాడు? ప్రేమ కోసం కోపాన్ని వదులుకున్నాడా? అన్నదే డియర్ కామ్రేడ్ కథ. శివ, అర్జున్‌రెడ్డి మిక్సింగ్ డియర్ కామ్రేడ్‌లో ఎంత వరకూ వర్కవుట్ అయ్యిందో తెలియాలంటే ఆ సినిమా విడుదల అయ్యేంత వరకూ ఆగాల్సిందే.