మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహర్షి'. పూజా హెగ్డే కథానాయిక. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే చిత్రీకరణ లో జాప్యం వల్ల ఈ సినిమా ఏప్రిల్‌లో రావడం లేదని, మేలో వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో.. మహేష్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తికి లోనయ్యారు.
అయితే వీటిపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. మహర్షి విడుదల తేదీలలో ఎలాంటి మార్పులు లేవని, అనుకున్న సమయానికే మహర్షిని విడుదల చేస్తున్నామని తేల్చేశారు దిల్‌రాజు. ఈ చిత్రాన్ని అశ్వనీదత్, పీవీపీతో కలసి దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్ 2 విజయోత్సోహంతో తిరుపతి వెళ్లారు దిల్ రాజు. అక్కడ మహర్షి విడుదల తేదీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. సో.. మహర్షిపై ఉన్న డౌట్లన్నీ క్లియర్ అయిపోయినట్టే.
ప్రస్తుతం పొలాచ్చీలో చిత్రీకరణ జరుపుకుంటోంది `మహర్షి`. అక్కడ మహేష్, అల్లరి నరేష్, పూజా హెడ్గేతదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరిలో దుబాయ్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. అటు నుంచి తిరిగొచ్చి హైదరాబాద్‌లో పాటల్ని తెరకెక్కిస్తారు. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.