దిల్ రాజు నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకులకు ఓరకమైన నమ్మకం బలపడిపోతుంది. హీరో ఎవరైనా, దర్శకుడిగా ఎవరి పేరున్నా అది `దిల్ రాజు` సినిమాగానే చలామణీ అవుతుంది. కథాబలమున్న సినిమాలు తీస్తాడని, ఏదో ఓ విషయం ఉంటుందని అందరి నమ్మకం. అది దిల్ రాజు జడ్జ్‌మెంట్ పై ఉన్న భరోసా. అయితే `థ్యాంక్యూ` సినిమాతో అది పూర్తిగా దెబ్బకొట్టేసింది. దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించిన సినిమా ఇది. విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం విడుదలై... ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది.
దిల్ రాజు బ్యానర్‌లో ఫ్లాపులు రావడం మామూలే. అదేం కొత్త విషయం కాదు.కానీ.. ఈ సినిమాపై దిల్ రాజు చాలా పర్సనల్ ఎమోషన్ పెంచేసుకొన్నాడు. ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఈ కథ తనని కూడా చాలా మార్చిందని, ఈ కథ విన్న తరవాత తన జీవితంలో తనకు సాయం చేసిన వాళ్లందరికీ థ్యాంక్యూ చెప్పాలనిపించిందని, అందుకోసం తాను కూడా అందరినీ కలిశానని, థ్యాంక్యూ చెప్పానని చెప్పుకొచ్చాడు. అయితే అంత ఎమోషన్ ఈ సినిమా చూసిన తరవాత ఎవ్వరికీ కలగలేదు. దిల్ రాజు మరీ ఈ సినిమాపై ఎక్కవ భరోసా పెట్టుకొన్నాడనిపించింది.
దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన బాలీవుడ్ సినిమాలు `జెర్సీ`, `హిట్` కూడా ఫ్లాపులే. ఈ రెండు కథలూ బాలీవుడ్ లో ఆడవని సినీ విశ్లేషకులు ముందు నుంచీ ఊహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ఇది వరకు దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన `శ్రీనివాస కల్యాణం`పై కూడా దిల్ రాజు ఇలానే గట్టిగా ఆశలు పెట్టుకొన్నాడు. హిట్టయి తీరుతుందని ఆశించాడు. కానీ అది కూడా ఇలానే బోల్తా కొట్టింది. దిల్ రాజు గట్టిగా నమ్మిన సినిమాలే ఫ్లాపులు అవుతున్నాయంటే ఆయన జడ్జ్‌మెంట్ కి ఏదో అయ్యింది.