సంక్రాంతి పోటీ టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సంక్రాంతి అనేసరికి పెద్ద సినిమాల హడావుడి మామూలుగానే ఉంటుంది. స్టార్ హీరోలంతా కట్టకట్టుకుని బాక్సాఫీసుపైకి దాడి చేస్తారు. కానీ రెండు సినిమాల మధ్య కనీసం ఒక్క రోజైనా గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. కానీ జనవరి 12న మాత్రం రెండు సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి. అటు మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`, ఇటు అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` ఒకే రోజున విడుదల తేదీ ప్రకటించాయి.
వీరిద్దరిలో ఎవరో ఒకరు తమ విడుదల తేదీని మార్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం చిత్రసీమలో వ్యక్తం అవుతోంది. అందుకే.. దిల్ రాజు ఇప్పుడు రంగంలోకి దిగినట్టు టాక్. అటు బన్నీతోనూ, ఇటు మహేష్‌తోనూ మాట్లాడి, రిలీజ్ డేట్ విషయంలో ఓ అవగాహనకు రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. మహేష్ సినిమాలో దిల్‌రాజుకి వాటా ఉంది. నైజాంలో థియేటర్లు కావల్సినన్ని దొరకాలంటే దిల్ రాజు సహాయ సహకారాలు కావాల్సిందే. ఈ నేపథ్యంలో.. దిల్ రాజు మాట ఈ ఇద్దరు హీరోలు తప్పకుండా వింటారని చిత్రసీమలోని పెద్దలు భావిస్తున్నారు. దిల్ రాజు ఈ ఇద్దరినీ ఎలా ఒప్పిస్తాడో చూడాలి మరి.