ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన స్వగృహంలో బాపినీడు తుదిశ్వాస విడిచారు. చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలైన గ్యాంగ్ లీడర్, ఖైది నెం 786 చిత్రాలకు ఆయనే దర్శకుడు. తన కెరీర్లో 19 చిత్రాల్ని తెరకెక్కించారు బాపినీడు. అందులో చిరంజీవితోనే ఎక్కువగా పనిచేశారు. మగమహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో.. ఇవన్నీ చిరంజీవితో తీసినవే.
ఆ తరవాత శోభన్ బాబు చిత్రాలకూ ఎక్కువగా పనిచేశారు. దర్శకుడిగా ఆయన ఆఖరి చిత్రం ఫ్యామిలీ. 1994 తరవాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టలేదు. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు.
ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు. ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.