'వినయవిధేయ రామ' వివాదం రోజు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సినిమాకి భారీ నష్టాలొచ్చిన నేపథ్యంలో దర్శకుడు, కథానాయకుడు ముందుకొచ్చి పారితోషికాల్లో కొంత భాగం వెనక్కి ఇవ్వాలని నిర్మాత డి.వి.వి దానయ్య డిమాండ్ చేయడం... అందుకు తగ్గట్టుగానే చరణ్ రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్టు వార్తలు రావడం చూశాం. విన్నాం. బోయపాటి శ్రీను మాత్రం ప్లేటు తిప్పి `పారితోషికం వెనక్కి ఇస్తాగానీ.. అసలు ఈ సినిమా లెక్కలేంటో చెప్పండి` అని అడగడంతో నిర్మాతకీ దర్శకుడికీ మధ్య పెద్ద దుమారమే రేగింది.
ప్రస్తుతం ఈ గొడవ ఛాంబర్ దగ్గర ఆగింది. పారితోషికంలో ఎంత మొత్తం వెనక్కి ఇవ్వాలి? అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది? అనే విషయంలో దర్శకుడు - నిర్మాత మధ్య గొడవ జరుగుతోంది. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. అదేంటంటే.. రామ్ చరణ్ ఇంత వరకూ ఆ 5 కోట్లు వెనక్కి ఇవ్వలేదట. దానికీ ఓ కారణం ఉంది. చిరంజీవి - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనుంది. దీనికి దానయ్య నిర్మాత.
నిజానికి చిరు సినిమలన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తానే తీసేసుకుంటున్నాడు చరణ్. ఈ సినిమా మాత్రం దానయ్యకి అప్పగించాడు. చిరుతో సినిమా అంటే... విడుదలకు ముందే నిర్మాత భారీ లాభాలు తెచ్చుకోవడం ఖాయం. దాంతో పోలిస్తే రూ.5 కోట్లు ఏపాటి? అందుకే... దానయ్య కూడా చరణ్ డబ్బులు ఇవ్వకపోయినా ఏమీ అనడం లేదట. ఇప్పుడు దానయ్య దృష్టంతా బోయపాటి నుంచి ఆ 5 కోట్లు రాబట్టుకోవడం మీదే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.