పాపం.. యంగ్ డైరెక్టర్లు. వాళ్లకు ఇది కష్టకాలమే. ఎంత ప్రతిభ ఉన్నా సరే, లక్ కలసి రావడం లేదు. వాళ్లకు హీరోలు అందుబాటులో లేకపోవడం వల్ల ఖాళీగా ఉండిపోవాల్సివస్తోంది. ప్రభాస్ తో `సాహో` తెరకెక్కించిన సుజిత్ కి కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. రన్ రాజారన్‌తో ఆకట్టుకున్నాడు సుజిత్. ఆసినిమా చూసి, ప్రభాస్ అవకాశం ఇచ్చాడు. `సాహో` తెలుగులో సరిగా ఆడలేదు గానీ, నార్త్ లో మంచి వసూళ్లు దక్కించుకుంది. ఆ సినిమాని ఫ్లాప్ అని చెప్పలేం. చాలా పెద్ద సినిమాని సుజిత్ లాంటి కుర్ర డైరెక్టర్ కాస్త బాగానే హ్యాండిల్ చేశాడు. అయితే ఆ తరవాతే.. సుజిత్ మరో సినిమా చేయలేకపోయాడు.
చిరంజీవి తో లూసీఫర్ రీమేక్ చేసే ఆఫర్ సుజిత్ కే వచ్చింది. కానీ... ఆ అవకాశం చేతుల్లోంచి జారిపోయింది. ఆ తరవాత ఓ బాలీవుడ్ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అదీ కుదర్లేదు. సుజిత్ కి తెలుగులో హీరోలు దొరకడం లేదని, అందుకే ఖాళీగా ఉండిపోయాడని టాక్. అయితే... కన్నడ స్టార్ సుదీప్ తో తను ఓ సినిమా చేయబోతున్నాడట. ఇది కన్నడ సినిమానే. కాకపోతే.. మిగిలిన భాషల్లోనూ విడుదల అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులోనే సుజిత్ బిజీగా ఉన్నాడని టాక్. మరి ఇదైనా వర్కవుట్ అవుతుందో, లేదో?