విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇదిలాఉంటే, మొదట ఈ సినిమాని దర్శకుడు తేజ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించారు. కానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాధ్యతలను హీరో బాలకృష్ణ క్రిష్ చేతికి అప్పగించారు. 'అందరినీ మెప్పించేలా ఆయన జీవిత కథను తెరకెక్కించగలిగే నమ్మకం లేకనే నేను తప్పుకున్నాను' అని తేజ వివరణ కూడా ఇచ్చారు. అయితే, తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
'ఎన్టీఆర్ కథానాయకుడు' పై మీ స్పందన ఏంటి? అని తేజ ని మీడియా విలేఖరులు ప్రశ్నించగా, 'ప్రస్తుతం నా సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల ఆ సినిమా చూడలేకపోయాను. చూసుంటే ఖచ్చితంగా స్పందించేవాడిని' అని ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. కథాకథనాలు ఇంకాస్త మెరుగుగా ఉంటే బాగుండేదేమో కదా అని మీడియా ప్రతినిధులు అనగా' అది దర్శకుడిపై, ఆయన ఆలోచన శైలిపై ఆధారపడి ఉంటుంది' అన్నారు.
ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న 'సీత' సినిమా నిర్మాణ దశలో ఉంది.