కంగనా రనౌత్ `మణికర్ణిక` విడుదలకు ముందు నుంచీ రకరకాల వివాదాల్లో చిక్కుకుంది. అందులో ఈ సినిమా నుంచి క్రిష్ బయటకు వచ్చేయడం ఒకటి. మణికర్ణికకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన క్రిష్.. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే టీమ్ నుంచి బయటకు వచ్చేశాడు.
దాంతో మిగిలిన సినిమాని కంగనా తన దర్శకత్వంలోనే తెరకెక్కించుకుంది. దర్శకురాలిగా తన పేరు కూడా వేసుకుంది. అసలు ఈ సినిమా నుంచి క్రిష్ ఎందుకు బయటకు వచ్చేశాడన్న విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. క్రిష్ కూడా ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించేవాడు. కానీ ఇప్పుడు తొలిసారి నోరు విప్పాడు.
కంగనా ఈ సినిమాని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుందామని చూసిందని, సోనూసూద్ ని పక్కన పెట్టి, ఆయా సన్నివేశాల్ని రీషూట్ చేసిందని, దాదాపు 70 శాతం సన్నివేశాలు తాను తీసినవే ఉన్నాయని, 30 శాతం మాత్రం జోడించిందని క్లారిటీ ఇచ్చాడు క్రిష్. అంతేకాదు... తన పారితోషికం కూడా ఎగ్గొట్టారని కేవలం 30 శాతం మాత్రమే చెల్లించారని, మిగిలిన పారితోషికం గురించి చిత్రబృందం స్పందించడం లేదని వాపోతున్నాడు క్రిష్.