ఈ మధ్య దర్శక నిర్మాతలెవరూ ఖర్చుకి వెనుకంజ వేయడం లేదు. బడ్జెట్లు పరిధులు దాటినా సరే, పట్టించుకోవడం లేదు. అల వైకుంఠపురములోని సామజవరగమన పాటకు ఏకంగా 5 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆ మాత్రం ఖర్చు తెరపై కనిపించలేదు. ఇప్పుడు డిస్కోరాజా గురించి కూడా ఇలానే చెప్పుకుంటున్నారు. రవితేజ - విఐ ఆనంద్ కాంబోలో రూపొందిన చిత్రం డిస్కోరాజా. ఈనెల 24న విడుదల అవుతోంది. ఇందులో ఫ్రీకౌట్ అనే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది.
రవితేజ కి తగ్గట్టుగా మాసీగా, స్టైలీష్‌గా సాగబోతోంది ఈ పాట. ఈ పాట కోసమే దాదాపు 4 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. తెరపై ఈ పాట చాలా రిచ్‌గా కనిపించబోతోందని తెలుస్తోంది. పాట కోసం ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే, సినిమా కోసం ఎన్ని కోట్లు ధారబోశారో మరి. రవితేజ ఫ్లాపుల్లో ఉన్నాడు. వీలైనంత తక్కువ బడ్జెట్‌లో సినిమాని ముగించి, సొమ్ము చేసుకోవాలని చూసుకోవాల్సింది పోయి, ఇంతింత ఖర్చు పెట్టారంటే... నిర్మాత గట్స్‌ని మెచ్చుకోవాల్సిందే.