ఎంత డ్యామేజింగ్ టాక్ వచ్చినా, పవన్‌కళ్యాణ్ సినిమాకి సెకెండ్ డే 'డ్రాపింగ్స్' చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే, పవన్‌కళ్యాణ్‌కి ఉన్న స్టామినా అలాంటిది. అయితే ఆ స్టామినా ఏమయిపోయిందో ఇప్పుడు పవన్‌కళ్యాణ్ అభిమానులకి అర్థం కావడంలేదు. కనీ వినీ డిజాస్టర్ అని ట్రేడ్ పండితులు డిక్లేర్ చేసేసినా, పండగ సీజన్‌లో ఎలాగోలా 'అజ్ఞాతవాసి' కొంతమేర నష్టాల్ని తగ్గించుకోగలుగుతాడని అభిమానులు అంచనా వేశారు. కానీ రెండో రోజు రిజల్ట్ చాలా దారుణంగా ఉందట. మూడో రోజు పరిస్థితి ఇంకా దరుణమైపోయిందని అంటున్నారు.
బుధవారం సినిమాని రిలీజ్ చేయడం పెద్ద మైనస్‌గా మారిందని ఇంకొందరు అంటున్నా, దాన్ని మరికొందరు కొట్టిపారేస్తుండడం జరుగుతోంది. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చినా 60 కోట్ల పైన వసూళ్ళనే ప్రచారం అభిమానులకి కొంత ఊరటనిచ్చింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ లెక్కలు వారికి కొంత ఆనందాన్ని మిగిల్చాయి. కానీ ఆ అనందం వారికి ఒక్కరోజూ మిగల్లేదు సరికదా, మూడో రోజుకి పవన్ అభిమానులు కనీసం మాట్లాడలేని పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియాలో యాంటీ పవన్ ఫ్యాన్స్ ప్రచారం మొదలు పెట్టేశారు. ఇదంతా చూస్తూ, పవన్‌కళ్యాణ్‌కి ఒకప్పుడు ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదని కొందరు అంచనా వేయడం మొదలు పెట్టారు.
అది కొంత నిజమే కావొచ్చు. లేకపోతే మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా రెండో రోజు, మూడో రోజు అదీ పండగ సీజన్‌లో ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఎలా ఉంటుంది? పవన్ ఖచ్చితంగా ఇప్పుడు మేల్కొనాలి. తన స్టార్‌డమ్‌తో ఎలాంటి సినిమా అయినా చేసేస్తానంటే కుదరదు. అక్కడ త్రివిక్రమ్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు కానీ అంతిమంగా సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిందా? లేదా? అనేదే మెయిన్ పాయింట్.