ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఎన్నో అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఎంఎం క్రీమ్ పేరుతో బాలీవుడ్‌లోనూ పలు సినిమాలకు సంగీతం అందించారాయన. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే కీరవాణి, 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముందు భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేకపోయినట్టున్నారు. సోషల్ మీడియా వేదికగా కీరవాణి చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేశాయి. 'బ్రెయిన్‌లెస్ ఫెలోస్ టాలీవుడ్‌లో ఎక్కువ' అని ఆయన చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. కొన్నాళ్ళ క్రితమే ఆయన సినీ సంగీత దర్శకుడిగా రిటైర్ అవుతానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ రిటైర్‌మెంట్ ప్రకటనకు కారణం బహుశా ఆయన సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న అవమానాలే కారణం కావొచ్చు. మారుతున్న ట్రెండీ మ్యూజిక్, సినీ సంగీత విభాగంలో వస్తున్న మార్పులు ఇవన్నీ మేటి సంగీత దర్శకుడైన కీరవాణికి ఆందోళన కలిగించాయో లేదోగానీ, ఆ ట్రెండ్ పట్టుకుని పాకులాడుతూ కొందరు ఆయన్ని అవమానించడంతో ఆయన ఆ అవమాన భారాన్ని ఇలా వెల్లగక్కారని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ వివాదాలకు తావివ్వని కీరవాణి, ఇంతలా విరుచుకుపడటమంటే ఆలోచించాల్సిన అంశమే. ఏదేమైనప్పటికీ 'కొందరు' అని కీరవాణి అనుంటే సమస్య వచ్చేది కాదు. ఎక్కువమంది బ్రెయిన్‌లెస్ ఫెలోస్ అనడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమను ఆయన అవమాన పర్చారా? అన్న ప్రశ్నకు ఆయనే అవకాశం కల్పించారు.