ఓ సినిమా కోసం ఐదేళ్ళు పూర్తిగా అంకితమైపోవడమంటే ఏ హీరోకి అయినా చిన్న విషయం కాదది. కానీ ప్రభాస్ ఆ రిస్క్ చేశాడు. 'బాహుబలి' సినిమా కోసం కేటాయించిన టైమ్‌లో ఈజీగా ఆరేడు సినిమాలు చేసెయ్యొచ్చు. ఇంకా ఎక్కువే చేయగల సత్తా ఉన్న హీరో ప్రభాస్. అయితే ప్రభాస్ అక్కడ 'నంబర్'కి ప్రాధాన్యతనివ్వలేదు. చేసే సినిమా చరిత్రలో నిలిచిపోవాలనీ, చరిత్రలో తన పేరు నిలిపేలా అది ఉండాలని అనుకున్నాడు. అందుకే రాజమౌళిని నమ్మాడు. ఇంకే ఆలోచనా చేయకుండా పూర్తిగా 'బాహుబలి'కే కమిట్ అయ్యాడు. ఆ యజ్ఞం దాదాపుగా పూర్తయ్యింది. యజ్ఞ ఫలాల్ని ఇప్పటికే 'బాహుబలి' టీమ్ చూసేసింది. అసలు సిసలు ఫలితం ఏప్రిల్ 28న రానుంది. ఆ రోజు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇంకో వైపున 'బాహుబలి' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చాడు ప్రభాస్. పైనుంచి రోప్ సహాయంతో వేదిక మీదకు దిగాడు 'బాహుబలి' ప్రభాస్. రెండు చేతుల్లో రెండు కత్తులతో అచ్చంగా సినిమాలోలా ప్రభాస్ ఇంట్రడక్షన్ ఉండే సరికి ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది హర్షధ్వానాలతో. 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాలోని రెండు డైలాగుల్ని ప్రభాస్ చెప్పాడు. దాంతో అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని అభిమానులకు ప్రభాస్ హామీ ఇచ్చాడు.