తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త అర్థం చెప్పిన దర్శకుడాయన. దర్శ ధీరుడని సగర్వంగా తెలుగు సినీ పరిశ్రమ రాజమౌళి గురించి చెబుతుంది. అలాంటి రాజమౌళి కంటతడి పెట్టడమా? 'బాహుబలి ది కంక్లూజన్' వేడుక చూసినవారు ఆశ్చర్యపోయేలా చేసిన సంఘటన అది. సోదరుడు కీరవాణి, వేదికపై తనకోసం ఓ పాట రాసి, దాన్ని ఆలపిస్తోంటే రాజమౌళి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. కంటతడి పెట్టేశారు. అది చూసినవారి కళ్ళూ చెమర్చాయి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంతవరకు అత్యంత సాహసం చేసేశాడు రాజమౌళి. అదీ 'బాహుబలి' సినిమాతో. ఐదేళ్ళపాటు ఒకే సినిమా (రెండు పార్టులు అయినప్పటికీ) చేయడం, దాన్ని యజ్ఞంలా స్వీకరించడం చిన్న విషయం కాదు. ఆ సాహసం పూర్తయిన సందర్భంగా తన తమ్ముడ్ని కీరవాణి అభినందిస్తూ, పాటతోనే ఆ అభినందనను తెలియజేయడంతో రాజమౌళి ఉద్వేగానికి గురవడం సహజమే. ఆ క్షణంలో రాజమౌళిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. అది బాధ కాదు, ఉద్వేగం. ఈ ఐదేళ్ళలో ఎంతోమందితో కలిసి పనిచేసిన రాజమౌళి, ఆ అనుభూతుల్ని, సినిమా నిర్మాణంలో పడ్డ కష్టాన్ని నెమరువేసుకున్నారు అనంతరం వేడుకపై మాట్లాడుతూ. ఇంకో వైపున తన తమ్ముడికి అంత ఉద్వేగం కలిగేలా చేయవలసి రావడం గురించీ కీరవాణి చెప్పారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రాజమౌళి నైజం చాలా గొప్పదన్నారాయన. నిజమే రాజమౌళి కాబట్టి అంత పెద్ద 'బాహుబలి' తీసినా దర్శకుడిగా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనతోపాటుగా, సినీ పరిశ్రమలో తానూ ఒకడినని భావించి కొత్త దర్శకులతోనూ మమేకం అవుతుంటారు.