కథల్ని నమ్మినవాడెప్పుడూ చెడిపోడని సినీ పరిశ్రమలో ఓ బలమైన నమ్మకముంది. కమర్షియల్ సినిమాల్ని నమ్ముకున్నప్పుడే ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు సాధిస్తాయి. ఏమీ లేదనుకున్న ఓ సాధారణ కమర్షియల్ సినిమా సంచలన విజయం అందుకోవచ్చు. భారీ హంగులతో రూపొందే కమర్షియల్ సినిమా దారుణ పరాజయాన్ని చవిచూడొచ్చు. అయినప్పటికీ కూడా ప్రయోగాల బాట పట్టాలంటే కొంత టెన్షన్ ఏ హీరోకి అయినా సహజం. అయితే కమర్షియల్ స్టామినా నిరూపించుకున్న హీరోలు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలి తప్పదు. అదే చేస్తున్నాడు రామ్‌చరణ్. 'ధృవ' సినిమాతో పెద్ద ప్రయోగమే చేశాడు. అది రీమేక్ సినిమా అయినప్పటికీ అది చరణ్‌కి సాహసమే. ఆ సాహసంలో విజయవంతమయ్యాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అదే సుకుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా. ఇందులో చరణ్ గెటప్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. లుంగీ కట్టి, 1980 నాటి కాలంలో ఓ సాధారణ కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంతో కూడిన కథ అది. ఆ గెటప్ ఇప్పటితరానికి ఎక్కడం కష్టం. ఎక్కువగా మలయాళ సినిమాల్లో ఇలాంటి గెటప్స్, ఈ తరహా నేటివిటీ చూస్తుంటాం. దీని గురించి చిత్ర యూనిట్ ఏమంటోందంటే, కథ చాలా బలమైనదనీ సినిమా తప్పక విజయం సాధిస్తుందని. చరణ్ తన ఇమేజ్‌ని పక్కన పెట్టి చేస్తున్న చాలా పెద్ద రిస్క్ ఇది. కథే చరణ్‌ని గట్టెక్కించాలి.