'కథానాయకుడు' ఫ్లాప్‌కి 'మహానాయకుడు' విజయంతో సమాధానం చెప్పాలని ఆశించిన చిత్రబృందానికి నిరాశే ఎదురైంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'ఎన్టీఆర్ మహానాయకుడు'కి నిరాశజనకమైన ఓపెనింగ్స్ లభించాయి. ఓవర్సీస్ ప్రీమియర్ షోల రిజల్ట్ చిత్రబృందానికి షాక్ ఇచ్చింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా కేవలం 90 వేల డాలర్లు మాత్రమే లభించాయి.
'కథానాయకుడు' ఓపెనింగ్స్‌తో పోలిస్తే.. ఇది చాలా తక్కువనే చెప్పాలి. ప్రీమియర్ షోలకే ఇలా ఉంటే... మిగిలిన రోజుల మాటేమిటన్నది చిత్రబృందానికి అంతుబట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. పబ్లిసిటీ విషయంలో బాలకృష్ణ చాలా ఉదాసీనంగా వ్యవహరించడం, సినిమాలకు ఇది సరైన సీజన్ కాకపోవడం, కథానాయకుడు ఫ్లాప్ అవ్వడం.. మహానాయకుడుపై ఆసక్తిని తగ్గించేశాయి.
ఎన్టీఆర్ మహానాయకుడులో ఎలాగూ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లరని, చంద్రబాబు నాయుడుని హీరోగా చూపించే ప్రయత్నం చేస్తారని, అభిమానులు ముందే ఊహించారు. అదే నిజమైంది కూడా. అందుకే ఈ సినిమా గురించి జనాలు పట్టించుకోవడం లేదని టాక్. తొలి భాగానికి దాదాపుగా 20 కోట్లు వచ్చాయి. ఈసారీ అది కూడా కష్టమే అనిపిస్తోంది.