రాజమౌళి సినిమా అనగానే హాట్ కేకులా అమ్ముడు పోవడం తథ్యమైపోయింది. అందునా బాహుబలి తదుపరి చిత్రం. దానికి తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ ఆయె. అందుకే... 'ఆర్‌ఆర్ఆర్' రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇలా మొదలైందో లేదో.. అలా ఓవర్సీస్ నుంచి పోటీ మొదలైపోయింది. ఈ సినిమా కొనడానికి చాలామంది బయ్యర్లు పోటీ పడుతున్నారు.
అయితే.. దానయ్య ఈ సినిమాకి చెబుతున్న రేటు చూస్తుంటే చమటలు పట్టేస్తున్నాయి. అవును... 'ఆర్.ఆర్.ఆర్' ఓవర్సీస్ కోసం 75 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. హిందీలో షారుఖ్, అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ ల ఓవర్సీస్ రేటు ఇది. బాహుబలి 2 ఓవర్సీస్‌లో 60 కోట్లు సాధించింది. అందుకే ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం 75 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవర్సీస్‌లో వంద కోట్లు కొడితే తప్ప... ఈ పెట్టుబడిని తిరిగి రాబట్టలేరు.
బాహుబలి సినిమాకి ఇంటర్నేషనల్‌గా మార్కెట్ ఏర్పడింది. ఆ సినిమా చూడాలన్న కుతూహలం రోజు రోజుకీ ఎక్కువైపోయింది. అందుకే 60 కోట్లు అవలీలగా అందుకుంది. దాన్ని చూసి.. 'ఆర్‌ఆర్‌ఆర్'ని 75 కోట్లు పోసి కొంటారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ ఈ సినిమాని ఎవరు కొన్నా.. అది టాలీవుడ్‌కి కొత్త రికార్డే అవుతుంది.