ప్రధాని నరేంద్రమోడీ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న 'పీఎం నరేంద్రమోడీ' సినిమా మళ్లీ వాయిదా పడింది. సుప్రీంకోర్టు నుండి విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదనీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామనీ కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే మే 19 తర్వాతనే ఈ బయోపిక్ విడుదల కానుంది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మోడీ బయోపిక్‌కి 11 కత్తెరలు పడ్డాయి. విద్వేషాలు రెచ్చగొట్టించేలా ఉన్న కొన్ని సీన్స్‌కి సెన్సార్ బోర్డు సభ్యులు నిరభ్యంతరకంగా కత్తెర విధించారు. అలాగే మరికొన్ని అభ్యంతరకర సంభాషణలకు బీప్ శబ్ధం వినిపించనుంది. మోడీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాల్లో ఆయన గెటప్ అచ్చుగుద్దినట్లు నరేంద్ర మోడీని తలపిస్తోంది.
ఒమంగ్ కుమార్ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహించారు. ఇకపోతే, వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇటీవల మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో కరడు కట్టిన ప్రతినాయకుని పాత్రలో కనిపించి మెప్పించాడు.