ఎజైల్ మూవీమేకర్స్ సంస్థ అధినేత, చిత్ర నిర్మాత వి.ఆర్.కె. రావు (వేమూరి రామకోటేశ్వరరావు) తన వంతు సాయంగా టీవీ, చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తున్నారు. బుధవారంనాడు మధురానగర్, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పలువురు కార్మికులకు సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా వి.ఆర్.కె. రావు మాట్లాడుతూ.. నిర్మాతగా కొన్ని చిత్రాలే నిర్మించినా, బుల్లితెరపై పలు సీరియల్స్, టెలిఫిలింస్, డాక్యుమెంటరీలు చేశాను. అనేక నంది అవార్డులు కూడా తీసుకున్నాను. ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ వల్ల పరిశ్రమ దాదాపు స్తంభించి పోయింది. మా ఎజైల్ గ్రూప్ ద్వారా నగరంలో కొన్ని వారాలుగా వివిధ ప్రాంతాల్లో బాధితులకు నిజంగా అవసరమైన కుటుంబాలకు అనేక రకాలుగా సాయం చేస్తూ వస్తున్నాం. షూటింగ్‌లేకుండా ఇబ్బందిపడుతున్న టీవీ, సినీ కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి బుధవారంనాడు మధురానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో మొత్తం నాలుగు వందల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఖరీదైన నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది.
24 క్రాఫ్ట్‌కు చెందిన వారందరికీ ఒకేరోజు అందజేయలేము కనుక అంచెలంచెలుగా అందజేయనున్నాం. ఈ విషయం ఒకరోజు ముందుగానే ఆయా శాఖ కార్మికులకు సమాచారం అందజేస్తాం. భౌతిక దూరం పాటిస్తూ అందరూ క్రమపద్ధతిలో మేము ఇస్తున్న ఈ చిన్నపాటి సాయాన్ని అందుకుని సంతోషంగా వుండాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా సినీ పెద్దలకు చేసే విన్నపం ఏమంటే.. నేడు చిత్ర పరిశ్రమ స్తంభించిపోవడంతో ఎంతోమంది కార్మికులు అలమటిస్తున్నారు. రేపు షూటింగ్ లు మొదలైతే ఈ కార్మికులే మనకు అండగా నిలుస్తారు. అందుకే వారిలో చిరునవ్వు చూడాలి. అందుకు మనం వారిని బతికించుకోవాలి. మళ్లీ చిత్ర జగత్తు సంతోషంగా కళకళలాడుతూ ముందుకు రావాలి. ముందు ముందు మంచిరోజు వస్తాయని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.